ఎన్టీఆర్ అభిమానులకు సీఎం రేవంత్ పిలుపు..

★కారు పార్టీని బొందబెట్టాలి

సాక్షి డిజిటల్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం గడ్డపై చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి తారక రామారావు అభిమానులు, చంద్రబాబు నాయుడు అనుచరులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో.. ఆయన తనదైన శైలిలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం ఉనికిని దెబ్బతీసేందుకు గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీని అణచివేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున పాతిపెట్టాలని.. గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలను తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను, ఎన్టీఆర్ అభిమానులను తనవైపు తిప్పుకునేలా ఆయన రాజకీయ బాణాలను ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ గడ్డపై నందమూరి తారక రామారావుకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడుకి ఎంతో మంది సహచరులు, అనుచరులు ఈ రాష్ట్రంలో ఉన్నారు’.. ‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేయాలని కక్ష కట్టి, ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అప్పట్లో టీడీపీని తుడిచిపెట్టడానికి వారు చేయని ప్రయత్నం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.