తల్లిదండ్రులు, పుట్టిన ఊరు జీవితానికి ఆధారం:

★సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా...75 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లాకు అవకాశం వచ్చింది. ’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.‘2006లో జిల్లా పరిషత్ సభ్యుడి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా చట్టసభల్లో పనిచేసిన నాకు పెద్దల సహకారంతో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లభించింది. ’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. భాషను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. మీలోని నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య మిమ్మల్ని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది.’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంకు భూమిపూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు గుర్తింపు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినీ విద్యార్థులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.‘విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ టాప్ ప్రాధాన్యంగా పెట్టుకున్నాం. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. యూపీఎస్సీ (సివిల్స్) రాసేవారిని ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం.’అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.‘ఇవన్నీ ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంత ఎదిగినా కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరవకండి. రేపటి మీ భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంది. 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకోండి. చదువు మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు గుర్తింపు, గౌరవం తీసుకురావాలి. లక్ష్యాన్ని సాధించి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలి.’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.