ఉద్యోగాల కల నెరవేరబోతోంది

★ ఏపీకి రూ.13 వేల కోట్ల భారీ ప్రాజెక్ట్.

జనం న్యూస్: గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు నేడు సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. కాకినాడలో 495 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీని వల్ల 2,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ(జనవరి17న) ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకినాడకు వెళ్తారు. 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని సీఎంవో తెలిపింది. రూ.13 వేల కోట్ల పెట్టుబడులు...2,600 ఉద్యోగాలు. గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఏఎమ్ గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను గ్రీన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరినాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.