
జనం న్యూస్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జోగు రామన్న ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వివరాలు... సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం (జనవరి 16) నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చూడుతున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తొలుత ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలో చనాక–కోర్టా పంప్ హౌస్‌ను ప్రారంభించి, ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టు ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాకు వెళతారు. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్‌మత్ బ్యారేజీను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ ప్రాజెక్టు ఆయకట్టు కింద యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. సదర్‌మత్ బ్యారేజీ నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సుమారు 18,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడింది. ఇక, నిర్మల్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాటు, బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.