పయనించే సూర్యుడు న్యూస్ : BMC ఎన్నికల్లో మహాయుతి కూటమి 120 సీట్లు గెలిచి చారిత్రక విజయం సాధించింది. BJP 93, శివసేన (షిండే) 27, ఉద్ధవ్ ఠాక్రే కూటమి 73 సీట్లకే పరిమితమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగర పాలక సంస్థ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేన (షిండే వర్గం) 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు మూడు దశాబ్దాల పాటు ముంబైపై ఏకచక్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు. శివసేన (యూబీటీ) నేతృత్వంలోని కూటమి కేవలం 73 సీట్లకే పరిమితమైంది. ఇందులో యూబీటీ 63, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 10 సీట్లు దక్కించుకున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల ఎన్సీపీలు కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం గమనార్హం. ఈ అఖండ విజయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రకమైనదిగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పాలనకు బ్రహ్మరథం పట్టారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజలు ఇచ్చిన గుర్తింపు ఇదని పేర్కొన్నారు. బీఎంసీ భవనంపై ఇక మహాయుతి జెండా రెపరెపలాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ముంబై అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమంపై తమ ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్లే ఓటర్లు ఈ స్థాయిలో ఆదరించారని విశ్లేషించారు. రాష్ట్రంలోని ఇతర 29 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ మహాయుతి కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోందని, ముంబై ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చివరిసారిగా 2017లో ఎన్నికలు జరగ్గా, కోవిడ్ మహమ్మారి, పలు న్యాయపరమైన చిక్కుల కారణంగా నాలుగేళ్లు ఆలస్యమయ్యాయి. ఈ సమరంలో ఉద్ధవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ ఠాక్రేతో జట్టుకట్టి బరిలోకి దిగారు. అయినప్పటికీ మహాయుతి ప్రభంజనం ముందు వారు నిలవలేకపోయారు. గత 30 ఏళ్లుగా బీఎంసీని తమ గుప్పిట్లో ఉంచుకున్న ఠాక్రే కుటుంబం ఇప్పుడు నియంత్రణ కోల్పోయింది. దేశంలోనే అతి సంపన్న మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరున్న బీఎంసీ బడ్జెట్ అనేక చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నాయి. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముంబై చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీకి చెందిన వ్యక్తి మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ గెలుపుతో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం మరింత బలపడింది. దేశ ఆర్థిక రాజధానిలో పట్టు సాధించడం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు గట్టి పునాది వేసుకుంది. ముంబై ప్రజలు పాత సెంటిమెంట్లను పక్కనబెట్టి అభివృద్ధి మార్గంలో నడవాలని దృఢంగా నిర్ణయించుకున్నట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.