
జనం న్యూస్: ‘దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలిచేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు హితోపదేశం చేశారు. ‘విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశాం. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి. ‘ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం. అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి?.’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.