
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా బీజేపీతో కలిసి వెళ్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా జనసేన ప్రకటించింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపింది. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు వేయనున్నట్టుగా పేర్కొంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా తెలిపింది. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా బీజేపీతో కలిసి వెళ్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో పోటీకి సంబంధించి టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్నేళ్లుగా తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటూ వస్తుంది. అయితే జనసేన తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా ప్రకటించడంతో తెలంగాణలో బీజేపీ, జనసేనలు కలిసి వెళ్తాయా? అనే చర్చ సాగుతుంది. గతంలో తెలంగాణలో పలు ఎన్నికల సమయంలో జనసేన ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతును ఇక్కడి బీజేపీ నేతలు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనసేన సైతం తెలంగాణ ఎన్నికల బరిలో దిగనుండటంతో ఇక్కడ బీజేపీ, జనసేన పొత్తు ఉంటుందా? లేదా పొత్తు ఏపీకి పరిమితం అవుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. రామచందర్‌రావు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ప్రజల్లో బీజేపీకి క్రమంగా మద్దతు పెరుగుతుందని తాము ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. అయితే తమది జాతీయ పార్టీ అని పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రపదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ఏర్పాటైందని రామచందర్‌రావు చెప్పుకొచ్చారు. ఏపీలో, తెలంగాణ రాజకీయ పరిణామాలు వేరని అన్నారు. ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే బీజేపీ ఉందని చెప్పారు. తెలంగాణలో బలంగా ఉన్నామని, ఒంటరిగా ఎన్నికకు వెళ్లాలనేదే స్థానిక నాయకుల మాట అని తెలిపారు. అయితే భవిష్యత్‌లో ఎవరి నుంచైనా మద్దతు తీసుకోవడం, పొత్తులకు సంబంధించి పార్టీ జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు జనసేన కూడా తమ ప్రకటనలో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా మాత్రమే తెలిపింది. పార్టీని బలోపేతం చేయనున్నట్టుగా పేర్కొంది. అంతేగానీ, ఎక్కడ కూడా పొత్తల గురించి ప్రస్తావించలేదు.