అవసరమైతే 144 సెక్షన్‌ విధించండి: కోడి పందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణకు బరులను సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కోడి పందాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణకు బరులను సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కోడి పందాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడి పందాలు, సంబంధిత బెట్టింగ్ కార్యకలాపాలను నిషేధించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను ఆదేశించింది. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణలో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టడం ద్వారా జీవహింసకు పాల్పడుతున్నారని అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని వాటిని నిలువరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 2019లో జారీ చేసి ఆదేశాలను కోర్టు అధికారులకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుర్తుచేశారు. అలాగే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులకు అనుగుణంగా చర్యలు ఉండాలని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే సంఘాలు ఏర్పాటు చేయాలని… పోలీసు అధికారులు, తహసీల్దార్లు, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులతో కూడిన ఉమ్మడి తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల వేదికలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే సీఆర్‌పీసీ 144 సెక్షన్ అమలు చేయడం ద్వారా కోడి పందాలు జరగకుండా చూడాలని చెప్పారు. ఇందుకోసం ఉపయోగించే పరికరాలను, బెట్టింగ్ డబ్బును స్వాధీనం చేసుకోవాలని అధికారులను జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తెలిపారు. ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పారు. నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోతే అధికారులు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో అవగాహన ప్రచారాలు నిర్వహించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగితే తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉందని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, సంక్రాంతికి ముందు నుంచే ఏపీలో (ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో) కోడి పందాల శిబిరాలు మొదలవుతుంటాయి. అయితే కోడి పందాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ గట్టు చప్పుడు కాకుండా జరుగుతుంటాయనేది అందరికి తెలిసిందే. ఈ పందాలు చూసేందుకు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి జనాలు గోదావరి జిల్లాలకు చేరుకుంటారు. దీంతో పూర్తిగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే కోడి పందాల్లో బెట్టింగ్‌ కూడా భారీగా సాగుతుంది. కోడి పందాల పోటీల్లో వేల నుంచి మొదలుకుని లక్షల వరకు బెట్టింగ్‌లు సాగుతుంటాయి. మొత్తంగా సంక్రాంతి పండుగ ముగిసేసరికి కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయని చెబుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *