సోమనాథ్ దర్శనంలో ప్రధాని మోదీ

★ వైభవంగా స్వాభిమాన్ పర్వ్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్నారు. 1026లో సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు, పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భేటీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని చారిత్రక సోమనాథ్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ప్రధాని రాకతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వెయ్యి సంవత్సరాల క్రితం 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన తొలి దాడిని, ఆ తర్వాత ఆలయం తట్టుకుని నిలబడిన తీరును గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వెయ్యేళ్ల చరిత్రకు సాక్ష్యం జనవరి 8 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1026లో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి వెయ్యి ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నోసార్లు దాడులకు గురైనప్పటికీ, ఈ ఆలయం భారతీయ విశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో దీని పునర్నిర్మాణం జరిగింది. 1951లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. పునర్నిర్మాణం జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవడంతో ఈ వేడుకలకు మరింత విశిష్టత చేకూరింది. దేశవ్యాప్తంగా వందలాది మంది సాధువులు ఇందులో పాల్గొంటున్నారు. ఓంకార జపం డ్రోన్ షో అంతకుముందు రాజ్‌కోట్‌లోని హీరాసర్ విమానాశ్రయంలో దిగిన ప్రధానికి గుజరాత్ మంత్రి కున్వార్‌జీ, మేయర్ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిరంతరాయంగా 72 గంటల పాటు ఈ జప కార్యక్రమం కొనసాగుతోంది. అనంతరం రాత్రి వేళ ఆలయం వద్ద ప్రత్యేక డ్రోన్ షో ఏర్పాటు చేశారు. నేడు శౌర్య యాత్ర ఆదివారం (జనవరి 11) ఉదయం ప్రధాని మోదీ 'శౌర్య యాత్ర'లో పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్మారకార్థం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో 108 గుర్రాలతో కూడిన భారీ ఊరేగింపు ఉంటుంది. ఇది వారి త్యాగానికి, వీరత్వానికి అద్దం పట్టనుంది. ఆ తర్వాత మోదీ సోమనాథ్ ఆలయంలో దర్శనం, పూజలు చేస్తారు. ఉదయం 11 గంటల సమయంలో సోమనాథ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు." సోమవారం (జనవరి 12) ప్రధాని షెడ్యూల్ అహ్మదాబాద్‌లో కొనసాగనుంది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో మోదీ సమావేశమవుతారు. ఉదయం 9:30 గంటలకు ఇరువురు నేతలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద జరిగే అంతర్జాతీయ గాలిపటాల పండుగ (కైట్ ఫెస్టివల్)లో పాల్గొంటారు.