
జనం న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సంక్రాంతి వేడుకల్లో జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు, డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు, గరగ నృత్యాలు, వీరనాట్య రీతులు, కోలాటాల సందళ్ల మధ్య సంబరాలు అంబరాన్నంటాయి. పీఠికాపురాన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడగా. పల్లె పదాలు, ప్రగతి వీచికలు అన్ని ఒకే వేదికపై ఆవిష్కృతం కాగా. డప్పుల శబ్దాల సందళ్లు, పల్లె పడుచుల కోలాటాల కోలాహలం మధ్య స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంప్రదాయబద్దంగా గో ఆరాధన చేసి, రంగవల్లులు తీర్చిదిద్దిన హరివిల్లుల ముంగిట ప్రకృతికి పూజలు నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే జానపదుల గీతికలు, శాస్త్రీయ నృత్యాలను ఆహుతులతో కలిసి ఆస్వాదించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను ప్రారంభించి మన హస్తకళల శైలిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్‌లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పిఠాపురానికి సంక్రాంతిని ముందుగానే తెచ్చిన ఈ సంబరాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు. హరిదాసు సంకీర్తనలు, మేళతాళాల మధ్య ఆటలాడే బసవన్నలు, గుండెలపై ధరించిన డప్పుల శబ్దాలతో చిందులేసే తప్పెటగుళ్ల కళాకారుల విన్యాసాలు, లయబద్దంగా సాగే గరగ నృత్యాలు, శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు, చిన్నారుల భవితను కాంక్షించే భోగిపళ్ల మహోత్సవాలు, ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు, హస్త కళల సోయగాల మధ్య అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి పిఠాపురం నుంచి స్వాగతం పలికారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శుక్రవారం ఉదయం గం.10.30 నిమిషాలకు పిఠాపురంకి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కి శాస్త్రీయ కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. థింసా కళాకారులతో పదం కలిపిన పవన్ కళ్యాణ్. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కళారూపాలు తిలకిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. ఆ కళా రూపాలు ఉప ముఖ్యమంత్రిని విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లెపడుచుల కోలాటాలు, వీర నాట్యాలు, గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే కొమ్ము కోయల సందళ్లు అడుగడుగునా స్వాగతం పలుకగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమవుతూ ఆసక్తిగా తిలకిస్తూ కళాకారులను పేరు పేరునా పలుకరిస్తూ వారితో ఫొటోలు దిగుతూ ముందుకు సాగారు. ప్రతి సంప్రదాయం గురించి ఆరా తీస్తూ వారి కళాకారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసా కళాకారులతో కలిసి పదం కలిపి నృత్యం చేశారు.