తీర అడవుల రక్షణపై పవన్ కల్యాణ్ ఆదేశాలు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అడవుల రక్షణకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అడవుల రక్షణకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ కల్యాణ్ మంగళవారం రోజున సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని గుర్తుచేశారు. సుమారు 974 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతోపాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలని ఆదేశించారు. ఆ పరిధిలో మడ, సరుగుడు, తాటిచెట్లు లాంటి మొక్కలతో నింపేసి తుపానులు లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంతానికి, తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలకు రక్షణ కల్పించాలని చెప్పారు. ఇప్పటికే ఏపీ కోస్తా తీరం వెంబడి 402 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు చేపడుతోందని అన్నారు. మిగిలిన భూముల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం ఎంత?, అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది?, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతులో ఉన్న భూమి ఎంత? అన్న అంశాలపై అధ్యయనం జరిపాలని సూచించారు. తీర ప్రాంతంలో ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. జనవరి నెలాఖరులోపు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని తెలిపారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడం సీఎం చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. మొదటి దశలో కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతం మొత్తం మొక్కలు పెంచాలని… మలి దశలో తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే కాలువలు, రోడ్లు, డొంకల వెంబడి మొక్కలు నాటాలని… చివరి దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మొక్కలు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మిస్టీ, కాంపా, గ్రీన్ క్లైమెట్ ఫండ్ తో పాటు సీఎస్ఆర్ నిధులు, ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున చెట్లు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. స్థానిక సమాజాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూ.. ఉన్న మొక్కలను రక్షించడం, తీర ప్రాంతం వెంబడి ఆక్రమణలను నిరోధించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే గ్రీన్ కవర్ కూడా పెరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాల వారీగా ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖలన్నింటినీ భాగస్వామ్యం చేయాలని చెప్పారు. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. అటవీశాఖతో పాటు ఉద్యానశాఖ, నీటిపారుదల, గిరిజన సంక్షేమ శాఖ, హెచ్ఆర్‌డీ, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వారం వారం లక్ష్యాలకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ పనుల్లో కచ్చితమైన పురోగతి కనబడాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *