భారత రైతుల శ్రమకు ప్రపంచ గుర్తింపు

* బియ్యం ఉత్పత్తిలో చైనాను మించిన భారత్ * గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి భారత్ * భారత రైతుల శ్రమకు ప్రపంచ గుర్తింపు

పయనించే సూర్యుడు న్యూస్ : జాతీయ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్‌ గొప్ప విజయం సాధించిందన్నారు. భారత్‌ మరో కీలక ఘనతను సాధించింది. బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తి దేశంగా అవతరించింది. దేశంలో మొత్తం 150.18 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్‌) అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త విత్తన జాతులను ఆయన విడుదల చేశారు. జాతీయ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్‌ గొప్ప విజయం సాధించిందన్నారు. ఒకప్పుడు ఆహార కొరతతో ఇబ్బందులు పడిన దేశం, ఇప్పుడు ప్రపంచానికి ఆహారం సరఫరా చేసే స్థాయికి ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. బియ్యం ఉత్పత్తిలో చైనా (145.28 మిలియన్‌ టన్నులు)ను దాటడం దేశానికి గర్వకారణమని చెప్పారు. ఈ విజయాన్ని అపూర్వమైన ఘనతగా మంత్రి అభివర్ణించారు. ప్రస్తుతం భారత్‌లో తగినంత ఆహార ధాన్య నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా దేశ ఆహార భద్రత మరింత బలపడిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని విదేశీ మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాజాగా విడుదలైన కొత్త విత్తన జాతులు రైతులకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఐకార్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ 184 కొత్త పంట జాతుల్లో ప్రధానంగా ధాన్య పంటలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 122 రకాల ధాన్యాలు, ఆరు పప్పు ధాన్యాలు, 13 నూనెగింజల పంటలు, 11 మేత పంటలు, ఆరు చెరకు రకాలు, 24 పత్తి జాతులు (వీటిలో 22 బీటీ కాటన్‌), అలాగే ఒక్కొక్కటి చొప్పున జూట్‌, పొగాకు రకాలు ఉన్నాయి. 1969లో పంటల గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 7,205 పంట రకాలకు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. వీటిలో 3,236 అధిక దిగుబడి విత్తన రకాలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే అనుమతి పొందినవని మంత్రి గుర్తు చేశారు. బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోవడం భారత వ్యవసాయ రంగం సాధించిన కీలక మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త విత్తన జాతుల ద్వారా రైతులకు మెరుగైన దిగుబడి, ఆదాయం పెరగడమే కాకుండా, దేశ ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *