అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

పయనించే సూర్యుడు న్యూస్ : మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే అనేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారు అని చెప్పుకొచ్చారు. వారు సభలో చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు. ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది తెలంగాణ ప్రజలకు తెలిసేది అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా గులాబీ పార్టీ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కాదని.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దామని సవాల్ విసిరారు. అసెంబ్లీలో కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని తాము అడగలేదని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అడిగారని చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి‘నీళ్లు - నిజాలు’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో కృష్ణా నదీ జలాలపై చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సభను వాకౌట్ చేసి వెళ్లిపోవడం తీవ్ర అభ్యంతరకరం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు తెలుసు ‘వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు.తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఇందుకు కాంగ్రెస్ కారణమని కేసీఆర్ విమర్శించారు.గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయో...ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నాం’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘ శాసన సభకు ఒక పవిత్రత ఉంది.ఈ సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అబద్దానికి ఆస్కారం లేదు. మాటల గారఢీలకు స్థానం లేదు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాబోదు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ. ఈ సభలో మాట్లాడే ప్రతిమాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావదిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.గడచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు. సభకు రండి అని నేను పదే పదే విజ్ఞప్తి చేశా. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాలేదు. సభలోకి రాము, చర్చలో పాల్గొనం అని హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమే ’అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎవరితోలు ఎవరు తీస్తారో తేలేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో కారణం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చారని అయినప్పటికీ తాము సభకు రామని వెళ్లిపోయారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తమను కోరారని... అయితే మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు, తోలు తీస్తామని మరొకరు మాట్లాడారని...తీరా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కుంటిసాకులు చెప్తూ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి వచ్చి ఉంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు.. ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది ప్రజలే తేల్చేవారంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ సూచనలు తీసుకుంటాం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోరికమేరకు కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి సభలో వెల్లడించారు. ఈ సందర్భంలో సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.సభకు వచ్చి కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వానికి ఇస్తారనుకుంటే అసెంబ్లీకి రాకుండా చర్చలో భాగస్వామ్యం కావడం లేదు అని మండిపడ్డారు.బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనలు ఇస్తే తీసుకుందామని తాము భావించామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు.ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అనుభవాలు తమతో పంచుకోవాలని సీఎం కోరారు.గతంలో మాజీ మంత్రి జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. నాడు అసెంబ్లీలో జానారెడ్డి, భట్టిలను అవమానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల అంశం ఇదిలా ఉంటే పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో జరిగిన జాప్యంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం, కమీషన్ల కక్కుర్తి వల్లే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల దక్షిణ తెలంగాణను ఎడారిగా మారిందని ఆరోపించారు.‘మేము వాస్తవాలు మాట్లాడతాం.. తప్పులుంటే సరిదిద్దుకుంటాం. కానీ కేసీఆర్ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల అంశాన్ని వాడుకుంటున్నారు’అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ధ్వజమెత్తారు.