పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్ ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాల ఒప్పందాలు, పాలమూరు ప్రాజెక్టు ఖర్చులు, BRS రాజకీయాలపై ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వరస ఓటములతో ఉనికి కోల్పోతున్న తన పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ మళ్లీ జలవివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో వాస్తవాలను వివరించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో మనకు దక్కాల్సిన వాటాను తాకట్టు పెట్టి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాలు విసిరారు. నీటి వాటాలో తీరని మోసం ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పిదాలే ఇప్పుడు శాపంగా మారాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల్లో ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించే ఒప్పందానికి కేసీఆర్ అంగీకరించారని గుర్తుచేశారు. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా చూస్తే తెలంగాణకు 71 శాతం జలాలు దక్కాల్సి ఉండగా, కేవలం 34 శాతానికే తలొగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు రాకుండా అడ్డుపడి, పదేళ్ల పాటు పొరుగు రాష్ట్రానికి మేలు చేశారని ఆరోపించారు. ఉనికి కోసమే కొత్త నాటకాలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవ్వడంతో బీఆర్‌ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని సీఎం అన్నారు. పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ మళ్లీ నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్పి, ఆంధ్రా వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల వర్షం కురిపించే వనరుగా మార్చుకున్నారని సీఎం ఆరోపించారు. ఏడేళ్లలో డీపీఆర్ లేకుండా, పర్యావరణ అనుమతులు రాకుండానే రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. జూరాల నుంచి నీరు తీసుకోవాల్సిన డిజైన్‌ను మార్చి, శ్రీశైలం వద్ద తోక భాగం నుంచి నీరు తీసుకునేలా మార్చారని విమర్శించారు. దీనివల్ల నీటి లభ్యత కష్టంగా మారిందన్నారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఈ మార్పులు చేశారని ధ్వజమెత్తారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు.. చుక్క నీరు లేదు గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా రూ.80 వేల కోట్లు అవసరమని వివరించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని, త్వరలోనే అసెంబ్లీ వేదికగా నీటి వాటాలపై పూర్తి స్థాయి చర్చ జరుపుతామని స్పష్టం చేశారు.