జనం న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మెుదలైపోయినట్లే. సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారు టికెట్లు బుక్ చేసుకోవడంతో అటు ఆర్టీసీ ఇటు రైల్వేలలో టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఇప్పటికే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది.బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సందడిగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలుగు లోగిళ్లలో ఇదే అతిపెద్ద పండుగ కావడంతో హైదరాబాద్లో నివశించే వారు, దేశ విదేశాల్లో ఉండేవారు సొంతూళ్లకు ప్రయాణమవుతారు. భారీ సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఊర్లకు తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో వారిని తరలించేందుకు వాహనాలు సరిపోవు. అటు ట్రైన్స్, ఇటు బస్సులు కూడా సరిపోవు. దీంతో ఇప్పటికే రైల్వే శాఖ 50కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బస్సు టికెట్లు అన్నీ ముందస్తుగానే ఫుల్ అయిపోయాయి. ఇలాంటి తరుణంలో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆర్సీపురం నుంచి బస్సులు ప్రారంభం. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్ఈఎల్, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.బీహెచ్ఈఎల్ డిపో రామచంద్రపురం నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్, కేపీహెచ్బీ, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తాయి. అయితే ఈ బస్సులు విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధా ఒక ప్రకటనలో వెల్లడించారు.