వైకుంఠ ఏకాదశి విశిష్టత ఆచరించాల్సిన నియమాలు

జనం న్యూస్: జన్మజన్మల పాపాలను పటాపంచలు చేసి, మహా విష్ణువు కరుణను, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే రోజే 'ముక్కోటి ఏకాదశి'. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని ఏ తారీఖున జరుపుకోవాలి? ఎందుకు రెండు తేదీల గందరగోళం ఏర్పడింది? అసలు ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనానికి ఉన్న విశిష్టత ఏమిటి? స్వామి వారి కృపను పొందేందుకు భక్తులు పాటించవలసిన ఆ 7 ముఖ్యమైన నియమాలు ఏమిటి? పూర్తి వివరాలు మీ కోసం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో 'వైకుంఠ ఏకాదశి' ఎంతో ముఖ్యమైనది. దీనినే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ పర్వదినం నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి ముక్కోటి పుణ్య ఫలాలు వస్తాయని హిందువుల నమ్మకం. 2025 లో డిసెంబర్ 30 న అంటే రేపు ముక్కోటి ఏకాదశి. మరి అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఎందుకు ఈ పేరు వచ్చింది? ఈ రోజు ఎలా పూజ చేసుకుంటే ఆ మహావిష్ణువు కరుణ లభిస్తుంది. మరిన్ని వివరాలు మీ కోసం. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ధనుర్మాసంలో, మకర సంక్రాంతికి కొద్ది రోజుల ముందు వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ఇది. దేవతలకు పగలు ప్రారంభమయ్యే ఈ శుభ సమయంలో, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ రోజు ఎలా మొదలైంది? పురాణాల ప్రకారం ఈ రోజే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు తన అంతరంగ శక్తి అయిన 'ఏకాదశి' దేవి ( దుర్గ దేవి అని కూడా చెప్తారు) సహాయంతో 'ముర' అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రోజు ఎవరైతే ఉపవాసముండి, జాగరణ చేస్తారో వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలని శ్రీ మహా విష్ణువు ఏకాదశి దేవి కి వరాన్ని ప్రసాదించాడు. ఆలా ఈ రోజు ఒక గొప్ప విశిష్టమైన రోజుగా మారింది. ఈ రోజే ముక్కోటి దేవతలు వైకుంఠానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారట. నేడు గరుడ వాహనంపై స్వామి వారు ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం. ముక్కోటి దేవతలతో విష్ణు భగవానుడు కలిసి వస్తారు కాబట్టి ఈ రోజును ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు.