
జనం న్యూస్: విశాఖపట్నంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలాంటి అవసరాలకు వినియోగించనుందనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలాంటి అవసరాలకు వినియోగించనుందనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండపై ప్యాలెస్ నిర్మించిన స్థలం పర్యాటక శాఖకు చెందినదని, అందువల్ల వాటిని పర్యాటక రంగానికి వినియోగించడమే సముచితమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ నిర్మాణాన్ని పర్యాటక ఆస్తిగా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రుషికొండ ప్యాలెస్ సముదాయం విశాఖపట్నం పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ భవనాలను పర్యాటకంగా వినియోగించుకోవడం. వినోదం, వారసత్వ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు. రుషికొండపై నిర్మించినవి విలాసవంతమైన భవనాలు అని.. వీటి నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆదాయం రాకపోతే భవనాల సంరక్షణ ప్రభుత్వానికి భారం మారుతుందని తెలిపారు. హోటల్ లేదా రిసార్ట్ తరహా ప్రాజెక్టుగా లీజుకు ఇవ్వడం లేదా నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా ఉండడానికి ప్రైవేటు సంస్థను భాగస్వామిగా చేసుకోవడం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా పరిరక్షించడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తద్వారా తీరప్రాంత పర్యాటక కేంద్రంగా విశాఖ హోదాను బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ భవనాల వినియోగంపై నియమించిన కేబినెట్ సబ్‌కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘‘రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక ప్రాజెక్టుగా చేయాలి. ఎందుకంటే నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆదాయాన్ని సమకూర్చేందుకు పర్యాటక ప్రాజెక్టుగా చేయాలి. హోటల్ లేదా రిసార్ట్‌గా నిర్వహించేందుకు ప్రముఖ సంస్థకు అప్పగించాలి. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏమిటంటే. ప్రభుత్వ ఆధీనంలో లేదా ప్రభుత్వ భవనాలుగా రుషికొండ ప్యాలెస్‌ను ఉంచితే పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనిని ఒక పర్యాటక ప్రాజెక్టుకు అప్పగించడం ఉత్తమం, తద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది.’’ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. ఇదిలాఉంటే, రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎందుకోసం వినియోగించాలనే దానిపై కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీ విస్తృత సంప్రదింపులు, చర్చలు జరుపుతూ, రుషికొండ ప్యాలెస్‌ను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది.