భారత రక్షణ బలోపేతానికి గ్రీన్ సిగ్నల్

★రూ.79 వేల కోట్ల ప్రతిపాదనలకు డీఏసీ ఓకే

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఏసీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు అవసరమైన అనుమతులను మంజూరు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సుమారు రూ. 79,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్ల సేకరణ ప్రతిపాదనలకు అవసరమైన ఆమోదాన్ని (AoN) మంజూరు చేసింది. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కోసం కీలక సామర్థ్యాల పెంపుకు సంబంధించి ఈ కొనుగోళ్లు జరగనున్నాయని... ఇవి కచ్చితమైన దాడులు, వాయు రక్షణ, నిఘా, సురక్షిత కమ్యూనికేషన్లు, శిక్షణపై దృష్టి సారిస్తాయని అధికారులు తెలిపారు. భారత సైన్యానికి సంంధించిన ఖచ్చితమైన దాడులు నిర్వహించే, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆధునిక యుద్ధ పరిస్థితులలో ప్రత్యర్థి కీలకమైన లక్ష్యాలపై కచ్చితమైన దాడి సామర్థ్యాన్ని పెంచే లోయిటర్ మ్యునిషన్ సిస్టమ్స్ ప్రవేశానికి డీఏసీ ఆమోదం తెలిపింది. అలాగే చిన్న, తక్కువ ఎత్తులో ఎగిరే వైమానిక ముప్పులను, ముఖ్యంగా డ్రోన్‌లను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి సైన్యం తక్కువ ఎత్తులో పనిచేసే తేలికపాటి రాడార్లను కూడా సేకరించనుంది. పెరుగుతున్న మానవరహిత వైమానిక ముప్పును ఎదుర్కోవడానికి, కీలక సైనిక స్థావరాలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాలను పరిరక్షించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ (IDDIS) Mk-IIకి డీఏసీ ఆమోదం తెలిపింది. పినాక మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ కోసం లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ మందుగుండు సామగ్రి సేకరణకు అవసరమైన అనుమతి మంజూరు చేయబడింది. తద్వారా సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం పెరుగుతుంది. నౌకాదళం సముద్ర నిఘా, కమ్యూనికేషన్లను బలోపేతం చేసేలా డీఏసీ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సుదూర సముద్ర ప్రాంతంపై నిఘా ఉంచేందుకు 'హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్' (HALE) రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌ను లీజుకు తీసుకోవడానికి అవసరమైన అనుమతి మంజూరు చేయబడింది. కార్యకలాపాల సమయంలో సురక్షితమైన, సుదూర సమాచార మార్పిడి కోసం 'హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో' (HF SDR) మ్యాన్‌ప్యాక్‌లను ప్రవేశపెట్టనున్నారు. నౌకాశ్రయాలలో నావికాదళ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌లను సురక్షితంగా తరలించడానికి, బెర్తింగ్ చేయడానికి కీలకమైన బొల్లార్డ్ పుల్ (BP) టగ్స్ కోసం అవసరమైన అనుమతి కూడా డీఏసీ మంజూరు చేసింది. ఇక, భారత వైమానిక దళం కోసం ఆస్ట్రా Mk-II బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి డీఏసీ ఆమోదం తెలిపింది. ఇది ఆయుధ పరిధి, పోరాట సామర్థ్యాన్ని పెంచుతుంది. అధునాతన పైలట్ శిక్షణ, కార్యాచరణ సంసిద్ధతకు సపోర్టు చేసే లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ కోసం పూర్తి మిషన్ సిమ్యులేటర్‌ను కూడా డీఏసీ ఆమోదించింది. అలాగే, విమాన భద్రత, ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ టేక్-ఆఫ్, ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్‌లు, SPICE-1000 లాంగ్-రేంజ్ గైడెన్స్ కిట్‌లకు డీఏసీ అనుమతులు మంజూరు చేసింది.