
జనం న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రధాని మోదీ ఈరోజు తన మన్ కీ బాత్ 129వ ఎడిషన్‌లో మాట్లాడుతూ. దేశంలో సాంప్రదాయ కళల అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంకి చెందిన లేస్ కళ గురించి యావత్ దేశం మాట్లాడుకుంటుందని అన్నారు. లేస్ కళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని చెప్పారు. ఈ లేస్ కళ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉందని చెప్పారు. దేశంలోని మహిళలు దీనిని ఓర్పుతో, నిశితమైన శ్రద్ధతో పరిరక్షించారని ఆయన అన్నారు. నేడు ఈ కళలు కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్లబడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా కళాకారులకు కొత్త డిజైన్లను నేర్పిస్తూ, మెరుగైన నైపుణ్య శిక్షణను అందిస్తూ, వారిని కొత్త మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నాయని చెప్పారు. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ కూడా లభించిందని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నరసాపురం లేస్ జీఐ ట్యాగ్ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నేడు దీని నుంచి 500 కంటే ఎక్కువ ఉత్పత్తులు తయారు చేయబడుతున్నాయి. 250కి పైగా గ్రామాలలో సుమారు లక్ష మంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు.నరసాపురం లేస్ చరిత్ర. నరసాపురం లేస్ ఉత్పత్తులకు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. స్వీడన్ మిషనరీల సంస్థలు ఇక్కడకు వచ్చి స్థానిక మహిళలతో పరిచయం పెంచుకోవడంలో భాగంగా లేస్ అల్లికలను పరిచయం చేశారు. జీఐ ట్యాగ్ కోసం చేసిన దరఖాస్తు పత్రాల ప్రకారం.. 1844లో స్కాట్లాండ్‌కు చెందిన మాక్రే దంపతులు దుమ్ముగూడెంలో (ప్రస్తుతం తెలంగాణాలో) క్రైస్తవ మిషనరీతో పనిచేశారు. వారు ఆ సయమంలో ఇక్కడి మహిళలకు లేస్ క్రాఫ్ట్ నేర్పించారు. ఈ ఉత్పత్తులను భారతదేశం, విదేశాలలో ఉన్న వారి స్నేహితుల ద్వారా విక్రయించారు. 1900ల ప్రారంభంలో గోదావరి ప్రాంతంలో 2,000 మంది మహిళలు లేస్ అల్లికలు చేసేవారు. దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేసు అల్లికలు.. అనతికాలంలోనే పెద్ద పరిశ్రమగా మారింది. వివిధ దేశాలలో నరసాపురం లేస్‌ను ఉపయోగించేవారు ఉన్నారు. 1930ల ప్రాంతంలో లండన్ వీధుల్లో నరసాపురంలేస్ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవని చెబుతారు. అయితే కళా నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న నరసాపురం లేస్ అల్లికలో కష్టం మొత్తం మహిళలదే. కేంద్రం సహకారంతో 2000లో నరసాపురం లేస్ పార్కును ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ అరుదైన హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను డీఆర్‌డీఏ ఉపయోగించుకుని భారతదేశంలోనే మొట్టమొదటి లేస్ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసింది. అయితే అంతకు ముందు వరకు లేస్ ఉత్పత్తులను విక్రయించడానికి సరైన మార్గం తెలియకపోవడంతో.. చాలా వరకు మహిళల శ్రమ దోపిడీకి గురయ్యేంది. అయితే లేస్ పార్క్ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది.