ఢిల్లీ ప్రజలకు మరింత సులభ సేవలు

*జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెనుక ఉద్దేశం

సాక్షి డిజిటల్ న్యూస్: పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, పరిపాలనను సులభతరం చేసేందుకు ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎస్‌సీటీడీ) ప్రస్తుతం ఉన్న 11 జిల్లాలను 13 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలోని అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, పరిపాలనను సులభతరం చేసేందుకు ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎస్‌సీటీడీ) ప్రస్తుతం ఉన్న 11 జిల్లాలను 13 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తూ డిసెంబర్ 25న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జిల్లా సరిహద్దులు మార్పు నేపథ్యంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల నమోదు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలనే (SROs) వినియోగించుకునేందుకు.. ఏ ఏరియా ప్రజలు ఏ కార్యాలయానికి వెళ్లాలో స్పష్టం చేస్తూ ఒక మ్యాపింగ్ జాబితాను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలలో ఎటువంటి ఇబ్బందులు కలగకకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు తాత్కాలికంగా ఉంటుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న షాహదారా జిల్లా ఇతర జిల్లాల పరిధిలో విలీనం కాగా… కొత్త ఓల్డ్ ఢిల్లీ, సెంట్రల్ నార్త్, ఔటర్ నార్త్ జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో గతంలో ఉన్న జిల్లాల సంఖ్య 11 నుంచి 13కు చేరింది. 13 జిల్లాలు.. సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, సెంట్రల్ నార్త్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఔటర్ నార్త్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ. ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం, ప్రస్తుతం ఉన్న 22 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 39కి విస్తరించే ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. జిల్లా సరిహద్దుల మార్పు ప్రక్రియ పూర్తయ్యే వరకు, పౌరులు తమకు కేటాయించిన పాత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలనే సంప్రదించాలని అధికారులు కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి కొత్త కార్యాలయాల వివరాలను ప్రభుత్వం వేరుగా ప్రకటించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎందుకు? పరిపాలనను క్రమబద్ధీకరించడానికి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లా పునర్వ్యవస్థీకరణ రూపొందించబడిందని అధికారులు తెలిపారు. అయితే, జిల్లాల సరిహద్దులు మారడంతో ప్రజలు ఏయే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలనే గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది.దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పూర్తి విస్తరణ అమలు అయ్యే వరకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *