
పయనించే సూర్యుడు న్యూస్ : నిర్మలా సీతారామన్ పీఎం లంక గ్రామంలో రూ.18 లక్షలతో మౌలిక వసతులు ప్రారంభించి, విద్యతో అభివృద్ధి సాధ్యమని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. అభివృద్ధికి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి విద్య ఒక్కటే సరైన మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆమె నర్సాపురం మండలం పెదమైనవాని లంక (పీఎం లంక) గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో యూనియన్ బ్యాంక్ సహకారంతో రూ.18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఆమె ప్రారంభించారు. ఇందులో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ప్రయోగశాల, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి దేశానికి కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిర్మలా సీతారామన్ 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన' పథకం కింద దత్తత తీసుకున్న గ్రామం పీఎం లంక. గ్రామాభివృద్ధిలో భాగంగా పాఠశాలను ఆధునీకరించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ పాఠాలపై వారికి ఉన్న అవగాహనను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలలో నూరు శాతం హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. తీరప్రాంత యువత ఉన్నత విద్యను అభ్యసించి, సొంత ప్రాంత సేవకు అంకితం కావాలని ఆమె ఆకాంక్షించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్య, క్రీడలు రెండూ కలిస్తేనే అంతర్జాతీయ వేదికలపై భారత్ గౌరవం పెరుగుతుందని ఆమె అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నేటి యువతపైనే ఉందని గుర్తుచేశారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి, మంచి పౌరులుగా ఎదగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పాఠశాల హెడ్‌మాస్టర్ ఎండీ ఇబ్రహీం, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.