పయనించే సూర్యుడు న్యూస్ : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు మేలు జరిగిందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన నూతన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో మార్పు మొదలైందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘దొంగ ముఖ్యమంత్రి’ అని సంబోధిస్తూ, రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 11 సార్లు రూ. 72 వేల కోట్లు నేరుగా ఖాతాల్లో వేసిన విషయాన్ని గుర్తుచేశారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు దేవుళ్లపై ఒట్లు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఒక్కసారి బయటకు రాగానే కాంగ్రెస్ నాయకులు భయంతో వణికిపోతున్నారని, రేవంత్ రెడ్డికి పాలన చేతకాక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తిట్టే సామర్థ్యం ఉందని, అవసరమైతే గిరిజన భాష నేర్చుకుని మరీ సమాధానం చెబుతానని హెచ్చరించారు. అయితే సీఎం పదవికి గౌరవం ఇచ్చి ఓపిక పడుతున్నట్లు స్పష్టం చేశారు. తాను గుంటూరులో చదువుకోవడం తప్పు అని రేవంత్ అంటున్నారని, మరి ఆయన తన అల్లుడిని భీమవరం నుంచి తెచ్చుకోవడం సరైనదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను రేవంత్ దూషిస్తున్నా, తాము మాత్రం ఆయన భార్య, కూతురు గురించి మాట్లాడటం లేదని, అది తమ సంస్కారమని చెప్పారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక రోజుకో స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని కేటీఆర్ తెలిపారు. అధికార పార్టీ అక్రమాలను, ప్రలోభాలను తట్టుకొని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారని ప్రశంసించారు. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి వంటి పెద్ద నాయకులు పార్టీని వీడినా, గ్రామ స్థాయి కార్యకర్తలు మాత్రం జెండా పట్టుకొని నిలబడ్డారని కొనియాడారు. గెలిచిన సర్పంచులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, అయితే రాజ్యాంగం కల్పించిన అధికారాలను తెలుసుకోవాలని సూచించారు. సర్పంచులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. ఒకప్పుడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయని వివరించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి సొత్తు కాదని, కేంద్రం విడుదల చేసే నిధుల్లో 75 శాతం నేరుగా పంచాయతీలకే వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ వేధింపుల నుంచి సర్పంచులను కాపాడుకునేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణతో పాటు ‘లీగల్ సెల్’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం లీగ్ మ్యాచ్ మాత్రమేనని కేటీఆర్ అభివర్ణించారు. రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా, అసెంబ్లీ ఎన్నికలను ఫైనల్స్‌గా భావించి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు కష్టపడితే కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లగచర్లలో గిరిజన మహిళలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మహబూబాబాద్‌లో తాము నిర్వహించిన భారీ సభ వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని, భూ సేకరణ విషయంలో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.