అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్

★అధికార ప్రతిపక్షాల మధ్య హై టెన్షన్!

జనం న్యూస్: ఈనెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం నీటి కేటాయింపులు విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు సైతం విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా?అనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని...ప్రజలపక్షాన అసెంబ్లీలో పోరాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో పోరాడుదామని కేసీఆర్ పిలుపు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి పాల్పడుతుంది అని చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్‌ పార్టీకి తప్ప ఇతర పార్టీలకు తెలంగాణపై పట్టింపు లేదు అని ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న నేపథ్యంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపట్ల పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సమావేశంలో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను పరిక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్‌పైనే ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని వెల్లడించారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని.. అసెంబ్లీలోనే ద్రోహాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి కేసీఆర్ మరోవైపు రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ముందు నిర్ణయించిన విధంగా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసి ఆ సభల వేదికగా దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సైతం భారీగానే గెలుపొందారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితం చేయడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.