
జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. భారత యంగ్ సెన్సేషనల్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. బీహార్ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, క్రికెట్ ప్రపంచంలో రికార్డుల దుమ్ముదులుపుతూ సాగుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ సెంచరీ, అండర్ 19 ఆసియా కప్‌లో, లిస్టు A క్రికెట్లో సెంచరీలు చేసిన వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుతం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే 36 బంతుల్లో సెంచరీ బాదాడు. 84 బంతుల్లో 190 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు వివిధ విభాగాల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు అందిస్తారు. బాలలకు ఇదే అత్యున్నత పురస్కారం. లిస్టు A క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. గతంలో 1986లో రైల్వేస్‌పై జహూర్ ఇలాహి, తన 15 ఏళ్ల 209 రోజుల వయసులో లిస్టు A సెంచరీ బాదాడు. 14 ఏళ్ల 272 రోజుల వైభవ్ సూర్యవంశీ, ఆ రికార్డును బ్రేక్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ, టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ టీమ్ తరుపున ఆడాలంటే కనీసం 15 ఏళ్ల వయసు దాటాలి. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 14 ఏళ్ల 272 రోజులు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకునే వైభవ్ సూర్యవంశీ, టీమిండియాకి ఆడేందుకు అర్హత సాధిస్తాడు.