మధ్యతరగతికి మోదీ సర్కార్ భారీ ఊరట..

*స్వామి-2 నిధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. లక్ష మందికి ఇళ్లు

సాక్షి డిజిటల్ న్యూస్: నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసి.. లక్ష మంది పేదలకు ఇళ్లను అప్పగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 15 వేల కోట్ల నిధితో స్వామి-2 పథకాన్ని ప్రారంభించనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ స్వామి 2 పథకానికి సంబంధించిన ప్రాథమిక నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎస్బీఐ వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ నిధిని నిర్వహించనుంది. ఇప్పటికే స్వామి-1 ద్వారా 55 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరగా.. రెండో విడతతో మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించబోతోంది. మధ్యలో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో భాగంగానే లక్ష మందికి సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో.. స్వామి-2 (SWAMIH-2) (Special Window for Affordable and Mid Income Housing-2)నిధిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ. 15,000 కోట్ల నిధితో ఈ స్వామి-2 ఫండ్‌ను త్వరలోనే కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా దాదాపు లక్ష మంది గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏంటీ స్వామి నిధి? బిల్డర్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోయిన అందుబాటు ధరల ఇళ్లు, మిడ్ ఇన్‌కమ్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం 2019లో ఈ స్వామి నిధిని ఏర్పాటు చేసింది. స్వామి ( SWAMIH ) అంటే Special Window for Affordable and Mid Income Housing. ఇప్పటికే చేపట్టిన మొదటి విడత విజయవంతమైంది. స్వామి-1 కింద ఇప్పటివరకు 55 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. రాబోయే 3, 4 ఏళ్లలో మరో 30,000 ఇళ్లను అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండో విడతలో భాగంగా తాజా 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లను ప్రాథమిక మూలధనంగా కేటాయించింది. మొత్తం రూ. 15 వేల కోట్ల సమీకరణతో లక్ష ఇళ్లను పూర్తి చేయనున్నారు. బ్యాంకులో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లిస్తూ.. అపార్ట్‌మెంట్లు చేతికి రాక అద్దె ఇళ్లలో మగ్గుతున్న లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలకు ఈ నిధి ఒక వరం అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *