తెలంగాణకు అన్యాయం జరిగితే ఉద్యమమే ఊరుకోం

* కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బలమైన పోరాటం అవసరమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బలమైన పోరాటం అవసరమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కలిసి తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ స్పష్టత లేదని, చరిత్రలోనూ అదే ధోరణి కొనసాగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ విషయంలో బీఆర్ఎస్ తప్ప మరే పార్టీకి నిజమైన పట్టింపు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు, అభివృద్ధి అవకాశాలను కాపాడుకోవడం బీఆర్ఎస్ బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, ప్రజాక్షేత్రంలో వాటిని ఎండగట్టాలని నేతలకు సూచించారు. అవసరమైతే ఉద్యమ మార్గంలోనూ ముందుకు వెళ్లేందుకు పార్టీ సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఊరుకునే ప్రసక్తే లేదని, ఇకపై దూకుడుగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ ఎలా నష్టపోతుందో వివరాలతో సహా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29న జరిగే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ఆ సమావేశాల్లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారని సమాచారం. అదేవిధంగా, అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించడం, ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహాన్ని ఖరారు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని, నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కేసీఆర్ ఈ సమావేశం ద్వారా మరోసారి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *