
పయనించే సూర్యుడు న్యూస్ : విశాఖపట్నం పోర్టు అథారిటీ 249 రోజుల్లో 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించింది. వెసెల్ మేనేజ్మెంట్ సిస్టమ్, VTMS అమలు ద్వారా అగ్రస్థానం లక్ష్యంగా ఉంది. భారతదేశ తూర్పు తీరానికి ముఖద్వారంగా పిలవబడే విశాఖపట్నం పోర్టు అథారిటీ, నౌకాయాన రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సరకు రవాణాలో ఏటా అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తూ, దేశంలోని ఇతర ప్రధాన పోర్టులకు గట్టి పోటీనిస్తోంది. కేవలం 249 రోజుల్లోనే 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకును హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది నిర్దేశించుకున్న 90 మిలియన్ మెట్రిక్ టన్నుల భారీ లక్ష్యాన్ని అధిగమించే దిశగా పోర్టు వడివడిగా అడుగులు వేస్తోంది. పోర్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. సరకు రవాణాను వేగవంతం చేసేందుకు రూ.14.03 కోట్లతో 'వెసెల్ మేనేజ్మెంట్ సిస్టమ్' కోసం ఒప్పందం కుదుర్చుకుంది. పోర్టులోని ఆర్ అండ్ డీ (R&D) యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మించి, కార్గో హ్యాండ్లింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. విశాఖ పోర్టు తన 90 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. వాటిలో యూరప్ నుంచి వచ్చిన 366 మీటర్ల పొడవైన భారీ కంటైనర్ షిప్ 'ఎంఎస్సీ మోనికా క్రిష్టినా'ను విజయవంతంగా బెర్తింగ్ చేసి రికార్డు సృష్టించింది. ఒకే నౌక (న్యూ కాసిల్ మాక్స్ లైన్) ద్వారా 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మాంగనీస్‌ను తీసుకువచ్చింది. భారత దేశ చరిత్రలో ఒక పోర్టుకు సింగిల్ నౌక ద్వారా వచ్చిన అతిపెద్ద సరకు ఇదే. హెచ్‌పీసీఎల్ కోసం 1.60 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను, అలాగే ఒకే నెలలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుని పాత రికార్డులను తిరగరాసింది. ఆగస్ట్ నెలలో ఒకే షిప్‌లోకి 6,290 మెట్రిక్ టన్నుల బియ్యం బస్తాలను ఎగుమతి చేసి సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు, సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వీపీఏ అన్వేషిస్తోంది. మాంగనీస్, బొగ్గు, జిప్సం వంటి ఖనిజాల రవాణా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. అత్యాధునిక వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (VTMS) అమలులోకి వస్తే, విశాఖ పోర్టు ప్రపంచంలోని మేటి పోర్టుల సరసన నిలుస్తుంది. తూర్పు తీరంలో ఇతర ప్రైవేటు పోర్టుల నుంచి పోటీ ఎదురవుతున్నప్పటికీ, విశాఖపట్నం పోర్టు అథారిటీ తన అనుభవంతో మరియు ఆధునిక వ్యూహాలతో అగ్రస్థానం దిశగా దూసుకుపోతోంది.