
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు భవనం నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి పరిపాలనా రాజధానిగా అమరావతికి ఉన్న మాస్టర్ విజన్‌కు అనుగుణంగా హైకోర్టు సముదాయాన్ని ఒక మైలురాయిగా నిలిచే నిర్మాణంగా ప్లాన్ చేస్తున్నారు. అమరాతిలో నిర్మించే ఐకానిక్ భవనాల్లో ఒకటైన హైకోర్టు శాశ్వత భవనంతో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి ఏడు అంతస్తులు (B+G+7) ఉండనున్నాయి. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్‌తో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు భవన నిర్మాణంలో 45వేల టన్నుల స్టీల్ వినియోగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అమరావతి రాష్ట్ర రాజధాని ప్రాజెక్టు ఆలస్యమైందని నారాయణ పునరుద్ఘాటించారు. ఇప్పుడు తాము ఆ అడ్డంకులను అధిగమించి వేగంగా ముందుకు సాగడానికి నిశ్చయించుకున్నామని చెప్పారు. అమరావతిలో నిర్మాణ పనుల వేగం గణనీయంగా పుంజుకుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నిర్దేశిత కాలపరిమితుల్లో రాష్ట్ర రాజధానిలో అవసరమైన కీలక సంస్థలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ అందించిన ప్రపంచ ప్రఖ్యాత డిజైన్ల ఆధారంగా హైకోర్టుతో సహా ఏడు ప్రతిష్టాత్మక భవనాలు రాజధానిలో రూపుదిద్దు కుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు సముదాయం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. హైకోర్టు భవనంలోని 2,4,6 అంతస్తులలో 52 కోర్టు హాళ్లు ఉంటాయని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఎనిమిదవ అంతస్తులో ఉంటుందని చెప్పారు.