ఏపీలో ప్రతి జిల్లా ఓ పారిశ్రామిక వాడ

★సీఎం చంద్రబాబు నాయుడు విజన్ వెల్లడి

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతాన్ని...ప్రతీ జిల్లాని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2047 నాటికి ఏపీని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని ప్రతీ జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన సమ్మిట్ ద్వారా 13.20 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడంలో సక్సెస్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై ప్రతీ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లా ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రను ఐటీ హబ్‌గా మార్చాలని... రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిచిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ జిల్లా ముఖచిత్రం మాట్లాడటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా విశాఖపట్నం ‘ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించాం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగింది’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.‘సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడి నుంచే సబ్ సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్పేస్ సిటీగా తిరుపతి ‘అమరావతి నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతుంది. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయి. విశాఖ- చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయి’సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నాం. వచ్చే 20 ఏళ్లలో చేపట్టాల్సిన రాష్ట్రాభివృద్ధికి ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో క్వాంటం ఎకోసిస్టం ‘అమరావతిలో క్వాంటం ఎకోసిస్టం వచ్చేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది’సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటం నిపుణులను తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వాంటం నిపుణులను తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్‌ సిద్దం చేసుకున్నాం. లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.‘క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. విజన్‌ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్. అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారతదేశానికి క్వాంటం వ్యాలీగా అమరావతి 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్ లాంటి అంశాలే దీనికి నిదర్శనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ అస్ట్రానామీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారు అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేది. ఇప్పుడు 4వ ఆతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.