
జనం న్యూస్: ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన ఏసు సందేశమే స్పూర్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.క్రైస్తవుల భద్రతకు, గౌరవానికి భంగం కలుగనివ్వం అని చెప్పుకొచ్చారు. 24వ తేదీ సాయంత్రంలోపు పాస్టర్లకు రూ.51 కోట్ల గౌరవ వేతనం అందించనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్‌గా జరుపుకుంటాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. ‘ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మన అందరికీ పండుగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘క్రీస్తు బోధనల్ని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు ఏసు. నమ్మిన సిద్దాంతం కోసం బలి దానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి.శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఈర్ష్య,ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ చెబుతోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం.‘గత ఐదేళ్లలో అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాము. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితికి తీసుకొచ్చాము. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశాం. క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకం, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం,పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇలా అన్ని విధాలా క్రిస్టియన్ మైనారిటీలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం రూ. 22 కోట్లు ఖర్చు చేసి,44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు...మొత్తం రూ.30 కోట్లు విడుదల చేశాం. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.