
పయనించే సూర్యుడు న్యూస్ : అనుమానాల మధ్య మొదలైన ప్రయాణం ఇప్పుడు ఆధిపత్యం! రేవంత్ రెడ్డి దాకా అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా సవాళ్లను ఎదుర్కొంటూ, గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికల విజయాలతో తన నాయకత్వాన్ని నిరూపించారు. నేను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా నేనున్నది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసే రంగంలోకి దిగాను ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు పూర్తి స్పష్టత ఉంది” అని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికలకు ముందు అన్న మాటలు. అన్నట్టుగానే సీఎం అయ్యారు నెమ్మదిగా నిలదొక్కుకుంటూ రాజకీయంగా మరింత బలపడుతున్నారు. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుముల రేవంత్ రెడ్డి రోజురోజుకు బలపడుతున్నారు. రేవంత్‌కు ముఖ్యమంత్రి పీఠం మున్నాళ్ల ముచ్చటే అని గుసగుసలాడిన వారే ఇప్పుడు మరో మూడేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని, అవకాశం వస్తే మరో ఐదేళ్లు కూడా ఆయనకు ఎదురు లేదని అంటున్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. అటు పరిపాలన పరంగా, ఇటు రాజకీయ పరంగా వరుస విజయాలు సాధిస్తూ సత్తా కలిగిన నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు రేవంత్ రెడ్డి. కనీసం మంత్రిగా కూడా పని చేయని వ్యక్తి సీఎంగా ఎలా రాణిస్తారన్న సందేహాలు, రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఎదురయ్యాయి. అనుకున్నట్టుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు సీఎం కుర్చీ ఓ ముళ్ల పీఠంలా కనిపించింది. ఖాళీగా ఉన్న ఖజానాతో ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కొండలాగా కనిపించిన ఎన్నికల హామీలు మరోవైపు, సహకరించని పార్టీ సీనియర్లు, మంత్రులు ఇలా ఎలా నెగ్గుకొస్తారన్న అనుమానం అందరిలోనూ కలిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ వంటి పథకాలతో ఎన్నికల హామీల అమలు ప్రారంభించారు. ఇచ్చిన హామీలన్నీ యథాతథంగా నెరవేర్చే పరిస్థితి లేకపోయినా, కొన్ని సవరణలతో మెజారిటీ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ వేదికగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రేవంత్ రెడ్డిపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయన్నది పక్కనబెడితే, గ్లోబల్ సమ్మిట్ వేదికగా దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర జరిగిన ఎంఓయూలు చర్చనీయాంశాలుగా మారాయి. పాలనపై తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో ఫోర్త్ సిటీని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం రేవంత్‌కు ఉపకరించింది. రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి వరుస విజయాలతో ఎదురు లేదని నిరూపించుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ రెండు స్థానాలు భారత రాష్ట్ర సమితికి చెందినవే కావడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిన అంశంగా చెప్పవచ్చు.