ఏపీ నుంచి ఆ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు

★సీఎం చంద్రబాబు ఓపెన్ ఆఫర్!

సాక్షి డిజిటల్ న్యూస్ : విద్యార్థులను, మేధావులను, సైంటిస్టులు, క్రీడాకారులను ఎంకరేజ్ చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు మించినవారు ఉండరు అని అంతా అంటూ ఉంటారు. అలాంటి వారికి సీఎం భారీ ప్రోత్సాహకాలు అందించి ఎంకరేజ్ చేస్తారు. తాజాగా సీఎం చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వందకోట్లు ఇస్తామని ఏకంగా బంపరాఫర్ ప్రకటించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం సహా దాని అనుబంధ రంగాల్లో నిపుణులను తయారు చేసేలా తాము కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్ లో భాగంగా వేల మంది టెక్ విద్యార్ధులతో ముఖ్యమంత్రి క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఈ క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమానికి క్వాంటం ప్రోగ్రామ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అలాగే అమెరికా నుంచి వైసర్ సంస్థ ప్రతినిధులు, క్యూబిట్, ఐబీఎం సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ సహా వేర్వేరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల విద్యార్ధులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్ లాంటి అంశాల్లో 10 లక్షల మంది నిపుణుల్ని, క్వాంటం సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్ డ్ రీసెర్చ్‌లో 1లక్ష మంది నిపుణులను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా విశాఖపట్నం ‘ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించాం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగింది’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.‘సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్ గా మారుతోంది. ఇక్కడి నుంచే సబ్ సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్పేస్ సిటీగా తిరుపతి ‘అమరావతి నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతుంది. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయి. విశాఖ- చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయి’సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నాం. వచ్చే 20 ఏళ్లలో చేపట్టాల్సిన రాష్ట్రాభివృద్ధికి ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భారత్ లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ, క్వాంటం రంగంలో మరింత పెట్టుబడులు రావావ్సి ఉంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటం విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్ కాస్టింగ్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయి. ఏఐ, క్వాంటం, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చు.