సాక్షి డిజిటల్ న్యూస్: అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దీనికి అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివిధ అంశాలను అథారిటీ ఆమోదించింది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సీఆర్డీఏ, ఏడీసీ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘రాజధాని ప్రాంతంలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేది. దీని కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించండి. ఏర్పాటు చేయబోయే కల్చరల్ సెంటర్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటల్స్ ‘రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలి. నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లకు లే అవుట్ల వద్ద పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘రాజధాని రైతుల సమస్యలపై జాప్యం లేకుండా పరిష్కరించాలి. రాజధాని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అటవీ సంపద, నదీ పరివాహకం, కొండలు వంటివి అమరావతికి ప్రకృతి శోభను తీసుకొస్తాయి. వివిధ రకాల పూల మొక్కలను రాజధాని ప్రాంతంలో నాటి పర్యాటకులను… ప్రకృతి ప్రేమికులను ఆకర్షించాలి. అదే విధంగా పార్కులను ఏర్పాటు చేయాలి. అమరావతికి వచ్చే వారికి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలి. ఈ మేరకు వాటి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్ సహా సీఆర్డీఏ, ఏడీసీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.