
సాక్షి డిజిటల్ న్యూస్ సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర మతాలను కించపరిచేట్టు మాట్లాడిన వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మత ప్రాతిపదికన దాడులకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలను ప్రభుత్వం కఠినంగా అణిచివేసిందని, అన్ని మతాలకు సమాన హక్కును స్వేచ్ఛను కల్పిస్తామని అన్నారు. ‘‘శాంతిని ఇవ్వాలి, ప్రేమను పంచాలన్న ఏసు ప్రభువు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏసు ప్రభువు స్ఫూర్తితో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు శాంతిని, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది. మానవ సేవయే మాధవ సేవ అని భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసు క్రీస్తు చాటారు. ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల ప్రభువు ఆరాధకులకు మాత్రమే కాదు... తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్కు కూడా ఒక మిరాకిల్ మాసం... 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ప్రకటన వెలువడటమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా డిసెంబర్ నేలలోనే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని అన్నారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి పేదలకు ఎంతో అంకిత భావంతో, ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు ఉదాత్తమైన సేవలు అందిస్తున్నాయని అన్నారు.