దేశంలో తొలి నేచర్ థీమ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభం

★ ప్రధాని మోదీ చేతుల మీదుగా నేచర్ థీమ్ టెర్మినల్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.4000 కోట్లతో నిర్మించిన ఈ భవనం భారతదేశంలోనే మొదటి ప్రకృతి ఆధారిత టెర్మినల్. అస్సాం మౌలిక సదుపాయాల రంగంలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన అత్యాధునిక కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. దాదాపు 4,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది భారతదేశంలోనే మొదటి 'ప్రకృతి ఆధారిత' విమానాశ్రయ భవనం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఇది కేవలం అస్సాం అభివృద్ధి మాత్రమే కాదని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల పురోగతికి నిదర్శనమని కొనియాడారు. ఈశాన్య భారతం జరుపుకుంటున్న ఈ 'అభివృద్ధి పండుగ'ను యావత్ దేశం గమనిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అస్సాం ప్రజలు, ముఖ్యంగా అక్కడి తల్లులు, సోదరీమణులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కష్టపడేలా తనలో స్ఫూర్తిని నింపుతున్నాయని మోదీ ఎంతో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ నూతన టెర్మినల్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరవీరులకు నివాళి - విద్యార్థులతో ముఖాముఖి తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 1979 అస్సాం ఉద్యమంలో ప్రాణాలర్పించిన 860 మంది అమరవీరులకు నివాళులర్పించనున్నారు. వారి స్మారకార్థం నిర్మించిన 'స్వహిద్ స్మారక క్షేత్రం' వద్ద ఆయన ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఆదివారం ఉదయం బ్రహ్మపుత్ర నదిపై 'చరాయిదేవ్' నౌకలో ప్రయాణిస్తూ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా 25 మంది పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించనున్నారు. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో సుమారు 30 నిమిషాల పాటు వారితో తన అనుభవాలను పంచుకోనున్నారు. రూ.12,000 కోట్ల ఎరువుల ప్లాంట్‌కు శంకుస్థాపన గువహటి కార్యక్రమాల అనంతరం ప్రధాని దిబ్రూగఢ్ మీదుగా నామ్‌రూప్‌కు చేరుకుంటారు. అక్కడ రూ. 12,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న అమ్మోనియా-యూరియా ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు అస్సాంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందని, స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. దేశీయ ఎరువుల ఉత్పత్తిలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించి మోదీ తమ అస్సాం పర్యటనను ముగిస్తారు. ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని అస్సాం అడవులు, కొండలు, స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. విమానాశ్రయం లోపల పచ్చని చెట్లు, వెదురు బొమ్మలు, స్థానిక కళాఖండాలతో అలంకరించారు. ఇది ఏడాదికి సుమారు 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. గతంలో ఉన్న పాత టెర్మినల్ కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం గమనార్హం.