కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

జనం న్యూస్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి తాజ్ ప్యాలెస్ హోటల్‌లో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి అమిత్ షాకు చంద్రబాబు ఈ సందర్బంగా వివరించారు. రాష్ట్రంలో ప్రధాన మౌలిక సదుపాయాలు, వృద్ధి ఆధారిత ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ పురోగతిని కూడా తెలియజేసినట్టుగా సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన స్పందన గురించిన వివరాలను అమిత్ షాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని అమరాతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌లను కలపాలని ఈ సందర్బంగా నితిన్ గడ్కరీని చంద్రబాబు కోరారు. జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయటంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడారు. వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో పాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచాయని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి అవుతున్న అమరావతిని జాతీయ రహదారులతో ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గడ్కరీని కోరారు. 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద మూడు కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపారు. విజయవాడ- హైదరాబాద్, చెన్నై- కోల్ కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్‌తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే హై-స్పీడ్ యాక్సెస్‌ కలిగిస్తుందని అన్నారు. నగరాల మధ్య కనెక్టివిటీతో పాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని స్పష్టం చేశారు. అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్‌లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తుందని వెల్లడించారు. ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ 6 లేన్ ఐకానిక్ బ్రిడ్జిని జాతీయ రహదారుల సంస్థ చేపట్టేలా చూడాలని గడ్కరీని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకమైన ప్రాజెక్టుగా 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *