
జనం న్యూస్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా మండిపడ్డారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా మండిపడ్డారు. భారతదేశంలో తయారీ రంగం క్షీణిస్తోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ విజయాలను అణగదొక్కేలా ఉన్నాయని, దేశ వృద్ధి పథానికి అవి విరుద్ధంగా ఉన్నాయని సింధియా అన్నారు. న్యూఢిల్లీలోని జరుగుతున్న ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2025లో జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ... భారతదేశం తన ఆర్థిక ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు వద్ద ఉందని అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను సైతం ప్రశ్నించారు. ‘‘మన దేశానికి చెందిన కొందరు విదేశీ గడ్డపై కూడా భరతమామాతను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి భారతీయుల హృదయాలలో గానీ, మనస్సులలో గానీ చోటు లేదు’’ అని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీకి దేశం కోసం ఉన్న దార్శనికతను కూడా జోతిరాదిత్య సింధియా ప్రస్తావించారు. భారతదేశం ఒక చారిత్రాత్మక అవకాశాన్ని చూస్తోందని సింధియా అన్నారు. ‘‘ఇదే మన తరుణం!... ప్రధాని మోదీ చెప్పినట్లుగా. ఇదే సమయం, సరైన సమయం. ఇదే భారతదేశపు సమయం’’ అని ఆయన అన్నారు.భారతదేశ ఆర్థిక పురోగతి, తయారీ రంగం క్షీణిస్తోందన్న వాదనను కూడా జ్యోతిరాదిత్య సింధియా తోసిపుచ్చారు. దేశ అభివృద్ధి పట్ల ప్రతి పౌరుడు గర్వపడాలని ఆయన అన్నారు. ‘‘భారతదేశం సాధించిన అభివృద్ది గురించి ప్రతి ఒక్కరూ గర్వపడాలి’’ అని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.