దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు

★కోర్టు అనుమతి లభించింది

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి దావోస్‌కు వెళ్లడానికి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి దావోస్‌కు వెళ్లడానికి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. వివరాలు... దావోస్‌లో ప్రతి ఏడాది జనవరిలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతుంటారు. భారతదేశం నుంచి కూడా వ్యాపారవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు దావోస్ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం‌కు హాజరయ్యేందుకు వెళ్తుంటారు. 2026 జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు' కేసులో బెయిల్‌పై ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఏసీబీ కోర్టు కొన్ని షరతులు విధించింది. వాటిలో పాస్‌పోర్ట్‌ను అప్పగించడం కూడా ఒకటి. అయితే ఇప్పుడు అధికారిక పర్యటన నిమిత్తం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లాల్సి ఉండగా... ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరైంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి అధికారిక పర్యటన నిమిత్తం 2026 జనవరి 19వ తేదీన దావోస్‌కు వెళ్లడానికి అనుమతి కోరగా ఏసీబీ కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. రూ. 10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు 2026 జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సహా సీఎం కార్యదర్శి కార్తీకేయ మిశ్రా, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్ ఉండనున్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ కూడా అయ్యాయి.