
పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు సంబంధించి.. కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఇక కేంద్రమంత్రులతో భేటీ తర్వాత రేపు రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఎల్లుండి నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకరోజు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై.. కీలక విషయాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయంపై కేంద్రమంత్రులతో చంద్రబాబు చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం రోజున వరుసగా ఆరుగురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్న చంద్రబాబు.. ఈ వరుస సమావేశాల తర్వాత శుక్రవారం రోజున రాత్రి తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి రానున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కేంద్ర నౌకాయాన జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం భేటీ కానున్నారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై కేంద్రమంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ కేంద్రమంత్రుల సమావేశం తర్వాత.. శుక్రవారం రాత్రి తిరిగి చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. ఆ తర్వాత శనివారం రోజున అనకాపల్లి జిల్లాలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో భేటీ అయితే.. పోలవరం ప్రాజెక్టుతోపాటు నల్లమల్ల సాగర్ వంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిల చెల్లింపు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులపైనా చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీలో టీడీపీ ఎంపీలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి అనేదానిపైనా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది.