సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు రోడ్లు, రవాణా, లాజిస్టిక్స్లో స్థిరమైన పెట్టుబడి అవసరమని అన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ 2025లో (India Economic Conclave 2025) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ఇది టైమ్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్న ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ 11వ ఎడిషన్. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కాన్క్లేవ్… భారతదేశం ప్రపంచ భౌగోళిక ఆర్థిక క్రమాన్ని ఎలా పునర్నిర్మిస్తోందనే దానిపై చర్చించడానికి పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్, గ్లోబల్ ఎక్స్పర్ట్స్లను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఈ వేదికపై నుంచి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… “ఏ దేశ వృద్ధికైనా, మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవి. రోడ్లు, నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకుండా పరిశ్రమ, వాణిజ్యం, వ్యాపారంలో మూలధన పెట్టుబడిని పొందలేము. పెట్టుబడి లేకుండా మనం ఉద్యోగాలను సృష్టించలేము. ఉద్యోగాలు లేకుండా మనం పేదరికాన్ని నిర్మూలించలేము’’ అని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై దేశంలో రోడ్లు, రవాణా నెట్వర్క్లను నిర్మించడంలో ఎలాంటి వనరుల పరిమితులను ఎదుర్కోదని నితిన్ గడ్కరీ అన్నారు. ‘‘ఈ రోజు నా అనుభవంలో… మనకు వనరుల సమస్య లేదు ఎందుకంటే రోడ్ల ద్వారా డబ్బు ఆర్జిస్తున్నాం. అలాగే విభిన్న నమూనాల అనుసరిస్తున్నాం. దేశంలో ట్రాఫిక్ సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల వనరుల సేకరణలో ఇబ్బందులు ఎదురుకావడం లేదు’’ అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఎగుమతులు, జీడీపీ వృద్ధిపై మౌలిక సదుపాయాల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ… భారతదేశం లాజిస్టిక్స్ ఖర్చులలో గణనీయమైన తగ్గింపు ఉందని గడ్కరీ తెలిపారు.. భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు గతంలో జీడీపీకి దాదాపు 16 శాతం వద్ద ఉందని… ఇది చైనాలో ఉన్న 8 శాతం, యూఎస్, యూరోపియన్ దేశాల సగటు 12 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా ఉండేదని ఆయన అన్నారు. ‘‘భారతదేశంలో గతంలో ఇది 16 శాతం ఉండేది. కానీ ఐఐఎం బెంగళూరు, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ చెన్నైల తాజా అధ్యయనం ప్రకారం… రోడ్డు రవాణాలో మన లాజిస్టిక్ ఖర్చు 6 శాతం తగ్గిందని నివేదిక సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు 16 నుంచి 10కి తగ్గింది. ఈ నివేదిక మూడు, నాలుగు నెలల క్రితం ఇచ్చింది. కాబట్టి నేడు ఈ లాజిస్టిక్ ఖర్చు 9 శాతం వద్ద సింగిల్ డిజిట్లో ఉందని నేను విశ్వసిస్తున్నాను’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తక్కువ లాజిస్టిక్స్ ఖర్చులు భారతదేశ ఎగుమతులను దాదాపు 1.5 శాతం పెంచుతాయని… ఇది ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని గడ్కరీ అన్నారు. ఇది సంపదను సృష్టించడమే కాకుండా మరిన్ని ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని పేర్కొన్నారు.