
పయనించే సూర్యుడు న్యూస్ : పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు. పీపీపీ దవారానే మెరుగ్గా సేవలు అందుతాయని చెప్పుకొచ్చారు. ఇవి తెలియకుండా కొంతమంది వైద్యశాలలు ప్రైవేట్ పరం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేస్తాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టత ఇచ్చారు. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతాయని అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ‘పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది ’అని సీఎం వివరణ ఇచ్చారు. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి. సీట్లు కూడా పెరిగాయి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. విమర్శలు చేస్తే భయపడేది లేదు ‘రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా..? గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. 13-14 శాతంతో అప్పులు తీసుకువచ్చి సమస్య సృష్టించారు. అనాలోచిత ధోరణితో ఎస్టాబ్లిష్ మెంట్ వ్యయం భారీగా చేశారు. ఇప్పుడు అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులను రీ-షెడ్యూలింగ్ చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వసనీయత వచ్చింది ‘జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధాం’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ‘మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయి. నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం, రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా... తగ్గించాం. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వసనీయత వచ్చింది. దీనిని కాపాడుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు ‘ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకునేలా చర్యలు ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు. ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్ర. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకం... కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలి. ప్రతీ నిమిషం నన్ను నేను బెటర్ గా తీర్చిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యం ‘దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకోవాలి. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ప్రీవెంటివ్, క్యురెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ‘ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు.