జాతీయ ఐక్యతపై రాజీ లేదు బంగ్లాదేశ్‌కు భారత్ వార్నింగ్!

★ భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తత-బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు నోటీసులు

పయనించే సూర్యుడు న్యూస్ : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. భారత ఈశాన్య రాష్ట్రాలను ముట్టడిస్తామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు హస్నత్ అబ్దుల్లా చేసిన తీవ్ర వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రిజాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసి, తన నిరసనను అధికారికంగా తెలియజేసింది. అటు ఢాకాలోని భారత హైకమిషన్‌కు వస్తున్న బెదిరింపులు, ఇటు సరిహద్దుల్లో నెలకొన్న అస్థిరతపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూనే.. సరిహద్దు వెంబడి నిఘాను పకడ్బందీగా పెంచింది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రిజాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి వస్తున్న బెదిరింపులు, అలాగే బంగ్లా రాజకీయ నాయకుల నుంచి వస్తున్న విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ తన నిరసనను గళమెత్తింది. 'సెవెన్ సిస్టర్స్' ముట్టడిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారాయి. బంగ్లాదేశ్ 55వ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాలైన 'సెవెన్ సిస్టర్స్'ను భారత్ నుంచి వేరు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇదీ చూడండి: ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్‌ కన్ను.. నేపాల్‌తో భేటీలో యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండవచ్చనే అనుమానంతో అస్సాంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. అక్రమ రవాణా, సరిహద్దు దాటే కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మారిపోతున్న బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1971 విముక్తి యుద్ధ వారసత్వాన్ని చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్‌తో సంబంధాలను తెంచుకుని పాకిస్థాన్ వైపు మొగ్గు చూపే ధోరణి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. మైనారిటీలపై దాడులు, భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వంటివి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను క్లిష్టతరం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. మిత్రదేశంగా ఉంటూనే.. తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమని బంగ్లా రాయబారికి స్పష్టం చేసినట్లు సమాచారం.