
పయనించే సూర్యుడు న్యూస్ : ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తాం. స్క్రీనింగ్ లో టాప్ 10లో ఉన్న రోగాలను గుర్తించి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా కార్యాచరణ.ప్రివెంటివ్ హెల్త్ విధానాలపై ప్రత్యేక దృష్టి. త్వరలో ప్రజల డిజిటిల్ హెల్త్ రికార్డులు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. యూఎన్ఎయిడ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పీటర్ పాయిట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, ఎఐజీ ఛైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్తి అహుజా, సైటెస్ ఛైర్ పర్సన్ రిజ్వాన్ కొయిటా, కోస్లా ల్యాబ్స్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ నాదముని, గేట్స్ ఫౌండేషన్ జినోమిక్స్ అండ్ ఎపిడామిలజీ డైరెక్టర్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్, పబ్లిక్ హెల్త్ నిపుణురాలు మార్గరెట్ ఎలిజిబెత్, ఢిల్లీ ఎయిమ్స్ ఎండోక్రినాలజీ విభాగాధిపతి డాక్టర్ నిఖిల్ టాండన్ అత్యుతన్నతస్థాయి నిపుణుల సలహా బృందంలో ఉన్నారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం సభ్యులు వర్చువల్ గా ఈ సమీక్షకు హజరయ్యారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం,చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్ లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పని చేస్తుంది. వివిధ అంశాల్లో ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయు చెప్పారు. వైద్యారోగ్య రంగంలో టెక్నాలజీ వినియోగం 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉంది. ప్రివెంటివ్ వెల్ నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.‘వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి. ఏపీలో మెడ్ టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నాం. వ్యాధుల బారిన పడి ఆ తర్వాత చికిత్స తీసుకోవడం కంటే..ముందుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాలపై దృష్టి పెట్టాలి. ఇలా చేయగలిగితే ప్రజల వైద్య ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక వెసులుబాటూ కలుగుతుంది. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. ముంబైలో త్వరలో గ్లోబల్ ఏఐ కన్వెన్షన్ జరగబోతోంది ఆ కన్వెన్షనులో వైద్యారోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేయాలని నిపుణుల బృందాన్ని కోరుతున్నా. ప్రజల ఆరోగ్య డేటాను విశ్లేషించి ముందస్తుగానే తగిన నియంత్రణా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. విధానాల రూపకల్పన ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు. అది క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలు అయినపుడే అది విజయవంతం అవుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తాం. స్క్రీనింగ్ లో టాప్ 10లో ఉన్న రోగాలను గుర్తించి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాం. ఇటీవల గిరిజన ప్రాంతాల విద్యార్ధుల వ్యక్తిగత శుభ్రతను నేర్పేలా ఓ చిన్న కార్యక్రమం చేపట్టాం. వివిధ అంశాలకు ఆంధ్రప్రదేశ్ ఓ స్టార్టప్ ఏరియాగా ఉంటుంది. వైద్యారోగ్య రంగంలో నర్సులు, వైద్యులు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో పౌష్టిక ఆహారం అనేది ముఖ్యమని ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాధన్ అన్నారు. వాయు, జల, భూ కాలుష్యాల ద్వారా ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతోందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రజల్ని చైతన్యం చేయాలని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా యువతలో డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నారని...దీనికి కాలుష్యమే ప్రధాన కారణమని అన్నారు. ఏఐ, డిజిటల్ హెల్త్ ద్వారా వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ వైవై టియో చెప్పారు. డిజిటల్, ఏఐ ఎనెబుల్డ్ సేవలు వైద్యారోగ్యంలో ఇప్పుడు ముఖ్యమైన అంశాలుగా మారాయని శ్రీకాంత్ నాదముని అన్నారు. ఏఐ డాక్టర్ ద్వారా ప్రాథమికంగా రోగి సందేహాలు తొలగించవచ్చని చెప్పారు. సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఏపీ తయారవుతోందని డాక్టర్ రిజ్వాన్ వెల్లడించారు. వైద్య విద్యార్ధులు, నర్సుల లాంటి వారికి డిజిటల్ హెల్త్ కేర్ లో శిక్షణ అందించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ, రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉందన్నది ప్రాథమికంగా గుర్తించాల్సి ఉంటుందని డాక్టర్ నిఖిల్ టాండన్ చెప్పారు. అన్ని వ్యాధులకు ఒకే రకమైన విధానాలను అనుసరించలేమని...ఈ మేరకు క్లినికల్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ద్వారా వేర్వేరు రకాలుగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వంతో కలిసి గేట్స్ ఫౌండేషన్ ముందుకు ప్రజారోగ్య పర్యవేక్షణ కోసం ఓ హెల్త్ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించేలా కార్యాచరణ రూపోందింస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిపుణుల బృందంతో భేటీ అవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.నిపుణులు ఇచ్చిన సలహాలను. సూచనలను క్రోడీకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు.