పోలీస్ శిక్షణార్థులకు ఆర్థిక ప్రోత్సాహం

★స్టైఫండ్ రూ.12,500కు పెంపు: సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రైనీ కానిస్టేబుళ్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ట్రైన కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500కు పెంచింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత అందజేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజా భద్రతకే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత పోలీసులదని అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కొత్తగా విధుల్లో చేరినవారు నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలాగే శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500 కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 5757మంది ట్రైనింగ్‌కు ఎంపిక ‘గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించి , యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. మీకు ఉద్యోగం వస్తే నాకు , మిత్రులు పవన్ కల్యాణ్ కు మంచి పేరు వస్తుందని 31 కేసులు వేశారు. వాటిని అధిగమించాం. కోర్టు కేసులు పరిష్కరించి నియామక పత్రాలను అందించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘6100 మంది రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో 6014 మంది సెలక్ట్ అయ్యారు. ఇందులో 5757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు. వీరిలో సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. మగవారికి ఏ విషయంలోనూ మహిళలు తీసి పోకూడదనే ఉద్దేశంతో గతంలోనే ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాను’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘ఆర్టీసీలో మహిళలను కండెక్టర్లుగా నియమించాం. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 183 మంది ఆదివాసీ అభ్యర్ధులు ఎంపిక కావడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ ను రూ.12,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదిక నుంచి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.4,500 నుంచి స్టైఫండ్ రూ.12,500 పెంచుతున్నామని.. సంక్రాంతి, క్రిస్మస్ పండుగలతో పాటు నియామక పండుగ కూడా అందరిలో సంతోషాన్ని నింపింది’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.