ఏపీ సర్కార్ బిగ్ అనౌన్స్‌మెంట్

★ నేతన్నలు, ఉద్యోగులకు శుభవార్త.

జనం న్యూస్: ఏపీ ప్రభుత్వం నేతన్నలు, ఆప్కో ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. బకాయిల చెల్లింపునకు ఆప్కోకు మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేనేత సహకార సంఘాలకు బకాయిల్లో 30 శాతం, ఆప్కో ఉద్యోగులకు 2 నెలల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు, ఆప్కో ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలిపారు.చేనేత సహకార సంఘాలకు 30 శాతం బకాయిలతో పాటు ఆప్కో ఉద్యోగులకు కూడా రెండు నెలల బకాయి జీతాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆప్కో అధికారులకు మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో ఆప్కో అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్కో సంస్థల ద్వారా చేనేత వస్త్రాల అమ్మకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని, చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా కృషి చేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఆప్కోను కాపాడుకోవాల్సింది ఉద్యోగులే. ఆప్కో సంస్థ ద్వారా ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాలతో అన్ని వయస్సుల వారికి అవసరమైన రీతిలో రెడీమేడ్ దుస్తులు తయారు చేస్తున్నామని అధికారులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవితకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా, ఇప్పుడిప్పుడే ప్రజల్లో కూడా చేనేత వస్త్రాల వినియోగంపై ఆసక్తి పెరుగుతోందని చెప్పుకొచ్చారు.కస్టమర్లను ఆకట్టుకునేలా షాపులను తీర్చిదిద్దడంతో పాటు నేర్పుతో, ఓర్పుతో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయించేలా ప్రావీణ్యత చూపాలన్నారు. ఆప్కో అటు ఉద్యోగులకు, ఇటు నేతన్నలకు ఉపాధి చూపే సంస్థ అని కొనియాడారు. ఆప్కోను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జీతాలు, కొనుగోలు బకాయిలు చెల్లించండి. చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు చెల్లించాల్సిన బకాయిల్లో 30 శాతం చెల్లించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ మొత్తం తక్షణమే ఆయా చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టంచేశారు. ఆప్కో సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు కూడా రెండు నెలల జీతాల బకాయిలు చెల్లించాలన్నారు. తక్షణమే జీతాల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో చేనేత సహకార సంఘాలకు రూ.3.90 కోట్లు జమ చేయడానికి ఆప్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉద్యోగులకు రెండు నెలలకు గానూ వారి ఖాతాల్లో రూ.1.70 కోట్లు జమ చేయడానికి అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నారు.