భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు

* ప్రపంచ వేదికపై భారత్ శక్తి

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలో కీలక నేతలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల మూడు రోజుల కీలక పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్‌కు చేరుకున్నారు. పశ్చిమ ఆసియా ఆఫ్రికా ప్రాంతాల్లోని ముఖ్య మిత్ర దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. జోర్డాన్ రాజు హిజ్ మజెస్టీ కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని జోర్డాన్ పర్యటన ప్రారంభించారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రక సందర్భంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్‌తో విస్తృత చర్చలు జరపనున్నారు. అలాగే అమ్మాన్‌లో ఉన్న భారతీయ సమాజంతో కూడా ప్రధాని భేటీ అవుతారు. ప్రాంతీయ సమస్యలు, ద్వైపాక్షిక బంధంపై చర్చ జోర్డాన్‌లో ప్రధాని మోదీ ఆ దేశ రాజు అబ్దుల్లా II తో ఏకాంత చర్చలు, బృంద స్థాయి చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సమీక్షించడం, ప్రాంతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోవడం ఈ చర్చల్లో ప్రధాన అంశాలు. జోర్డాన్ పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతల విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భారత్‌కు ఒక వ్యూహాత్మక గేట్‌వే. జోర్డాన్ భారతదేశానికి ఫాస్ఫేట్లు, పొటాష్ లాంటి ఎరువులను సరఫరా చేసే ముఖ్య భాగస్వామి. ద్వైపాక్షిక వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు ఉంది. భారత్ జోర్డాన్ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, పరస్పర వృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. మిగిలిన దేశాల పర్యటన వివరాలు తొలిసారి ఇథియోపియా పర్యటన: జోర్డాన్ తర్వాత ప్రధాని మోదీ మంగళవారం ఇథియోపియా పర్యటనకు బయలుదేరుతారు. ప్రధాని హోదాలో ఆయన ఇథియోపియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలపై చర్చిస్తారు. అనంతరం డిసెంబర్ 17-18 తేదీల్లో ఒమన్ సుల్తానేట్‌లో పర్యటిస్తారు. భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో వ్యూహాత్మక వాణిజ్య ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతారు. ఈ మూడు దేశాల పర్యటనతో భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో తన సహకారాన్ని మరింత పెంపొందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *