
పయనించే సూర్యుడు న్యూస్ : మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. నైపుణ్య గణన పోర్టల్, IndiaAI మిషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, InnoXR సెంటర్ ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా, రాష్ట్రంలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) చేపట్టేందుకు అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేశ్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్ మంగళగిరి నియోజకవర్గంలో విజయవంతమైందని, ఇందులో ఎదురైన సమస్యలను ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానంతో అధిగమించామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఈ పోర్టల్‌కు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని నారా లోకేశ్ కోరారు. ఐటీ, ఏఐ విస్తరణకు పలు ప్రతిపాదనలు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి: నైపుణ్య గణన పోర్టల్ సాయంతో దేశంలోనే తొలిసారిగా సమగ్ర స్కిల్ సెన్సస్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తోంది. యువత నైపుణ్యాలను గుర్తించి, వారికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించటం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు MeitY స్టార్టప్ హబ్ మద్దతు, అలాగే AVGC-XR, AR/VR, ఇమ్మర్సివ్ టెక్నాలజీల కోసం InnoXR సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనలు చర్చించారు. IndiaAI మిషన్ కింద రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ రోడ్‌మ్యాప్‌ను లోకేశ్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ నుంచి సానుకూల స్పందన లభించింది. విశాఖలో నైపుణ్య సంస్థ ఏర్పాటు కోరిక: ఈ దిల్లీ పర్యటనలో భాగంగా నారా లోకేశ్ కేంద్రమంత్రి జయంత్ చౌదరితో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (National Skill Training Institute) ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ లోకేశ్ త్వరలో సమావేశం కానున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. అంతకుముందు, లోకేశ్ తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశమై రాష్ట్ర అంశాలపై చర్చించారు.