సర్పంచ్‌ల ప్రమాణస్వీకార తేదీ, నిబంధనలపై పూర్తి వివరాలు

* ఈనెల 20న కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం * ప్రజల ఆశలతో సర్పంచ్ పదవీ బాధ్యతలు-ప్రమాణస్వీకారం

జనం న్యూస్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ ఎన్నికలు నేడు జరగనుండగా, 3,911 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ సంచాలకురాలు సృజన అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఈ నెల 11న మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగా నేడు (డిసెంబర్ 14న) రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20న జరిగే మొదటి సమావేశంలో కొత్త పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. ‘గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన (విజేత పేరు) అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.’ అని ప్రతిజ్ఞ చేస్తారు. ఆపై ప్రమాణపత్రంపై సంతకం చేసి అధికారికంగా బాధ్యతలను చేపడతారు. రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం రాష్ట్రంలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు మొత్తం 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవుల కోసం నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండో దశ ఎన్నికల కోసం మొదటగా 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో కొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 415 గ్రామ సర్పంచి పదవులు, 8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో ఐదు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఈ స్థానాలు పోను, మిగిలిన పంచాయతీల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించింది. మొత్తం 4,593 మంది రిటర్నింగ్‌ అధికారులు, 30,661 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పారదర్శకతను పెంచడానికి, 2,489 మందిని ఎన్నికల మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఈ ఎన్నికల కోసం 40,626 బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా.. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *