
సాక్షి డిజిటల్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. 2026 జనవరి 4వ తేదీ నుంచి 33 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఎంతో సంబరంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలలో ప్రతీ ఒక్కరూ పాల్గొంటారు.దేశ విదేశాలలో ఉన్నా సరే ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఇంటికి క్యూ కడతారు. అందుకే సంక్రాంతికి నెల రోజుల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇక హైదరాబాద్‌లో ఉండేవారు అయితే ఇప్పటికే అన్ని ట్రైన్స్‌లో టికెట్లు బుక్ చేసేసుకున్నారు. దీంతో సంక్రాంతికి టికెట్ దొరకడం కష్టంగా మారింది. మరోవైపు ఆర్టీసీ బస్సులలోనూ సేమ్ సీన్. ఇలాంటి సందర్భంలో పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించనట్లు ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 4వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి అని పేర్కొంది. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు 2025 డిసెంబర్ 14వ తేదీ (ఆదివారం) ఉదయం 08.00 గంటల నుండి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.