బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిపై కసరత్తు- బీజేపీ జాతీయ అధ్యక్షుడి కుర్చీ ఎవరిది?

పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు నామినేషన్లకు ముహూర్తం ఖరారు అయ్యిందని తెలుస్తోంది. శనివారం నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉందని ఆదివారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతుంది. దీంతో కమలదళానికి తదుపరి సారథి ఎవరు? అన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆ పార్టీ కసరత్తు మెుదలు పెట్టింది. ఏడాది కాలంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక జరగలేదు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీకాలం 2023లోనే ముగిసింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పదవీకాలాన్ని 2024 వరకు పొడిగించారు. 2024 నుంచి కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతూనే ఉంది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి ఇవాళ్టి నుంచి ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడితోపాటు జాతీయ కార్యవర్గ సభ్యులకూ నామినేషన్లు కూడా వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కమలానికి తదుపరి సారథి ఎవరు?అధిష్టానం ఆశీస్సులు పొందిన నేత ఏకగ్రీవంగా ఎన్నికవుతారా?అనూహ్యంగా పోటీ ఎదురవుతుందా?అనేది ఉత్కంఠగా మారింది. అధ్యక్ష రేసులో ఉన్నది వీళ్లేనా? బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం భారీగానే క్యూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రేసులో ధర్మేంద్ర ప్రధాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.జాతీయ స్థాయి రాజకీయాలపై ధర్మేంద్ర ప్రధాన్‌కు మంచి పట్టుంది. కేంద్రమంత్రిగా పలుమార్లు పనిచేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలపై అవగాహన ఉంది. అంతేకాదు బిహార్‌ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన పేరు ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి ఎంపిక జరిగేది ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పార్టీ రాజ్యాంగం ప్రకారం జరుగుతుందిజ తొలుత పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్య నాయకుల సమావేశం అవుతారు. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షుడి కోసం చర్చిస్తారు. అనంతరం సంప్రదాయం ప్రకారం జాతీయ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసి నామినేషన్ వేయిస్తారు. అప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అవుతంది. ఒకవేళ నామినేషన్లు ఒకటి కంటే ఎక్కువ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీ నిబంధనల ప్రకారం జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థి పేరును కనీసం 20 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అభ్యర్థి కనీసం 15 సంవత్సరాల పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధన ఉంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి 3ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. నామినేషన్లు బట్టి ఎన్నిక ఈ ఎన్నికల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తారు.ఎన్నిక జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఏకగ్రీవమా? పోటీ ఉంటుందా ? బీజేపీలో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఓ సంప్రదాయంగా వస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆశీస్సులు ఉన్నవారే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారన్నది బహిరంగ రహస్యం.ప్రస్తుతం కూడా తెరవెనుక మంతనాలు ఇప్పటికే పూర్తయ్యాయని అధిష్ఠానం ఎంపిక చేసిన నేత పేరునే ప్రతిపాదిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్లు కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారికి ముందుముందు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత ఉంది.అటు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేయడం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఈ క్రమంలో కొత్తరథసారథి ఎవరా? అన్న ఉత్కంఠ నెలకొంది.